దేశీయ వరి సాగులో విద్యార్థులు..

మేరీ స్టెల్లా కాలేజీలో….
వ్యవసాయ విద్యార్థులతో కళాశాల ప్రాంగణంలో వరి నాట్ల కార్యక్రమం
మైసూర్ మల్లిక, ఇంద్రాణి దేశీయ వరి రకాల సాగుకు ప్రోత్సాహం
పంట కోత అనంతరం విత్తనాలను ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులకు ఉచితంగా పంపిణీ
విద్యార్థులకు ప్రత్యక్ష క్షేత్ర అనుభవం కల్పిస్తున్న కళాశాల

విజయవాడ, (ఆంధ్రప్రభ): దేశీయ వరి రకాల పరిరక్షణతో పాటు సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో బుధవారం వరి నాట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్నయ్యసమ్మ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్నయ్యసమ్మ మాట్లాడుతూ, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగం విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు ద్వారా ప్రత్యక్ష క్షేత్ర అనుభవం లభిస్తోందన్నారు. కళాశాల ప్రాంగణంలో సంప్రదాయ దేశీయ వరి రకాలైన కాలా బట్టి, మైసూర్ మల్లిక, ఇంద్రాణి నారు మొక్కలను పెంచి, 21 రోజుల తర్వాత పొలంలో నాటడం జరిగిందని తెలిపారు. ఈ దేశీయ వరి రకాలు అధిక పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. పంట కోత అనంతరం సేకరించే విత్తనాలను ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులకు ఉచితంగా పంపిణీ చేసి దేశీయ వరి సాగును మరింత విస్తరించేందుకు కళాశాల కృషి చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం 25 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ పనులు సకాలంలో పూర్తై, మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డా. పి. లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి, స్టూడెంట్ డీన్ డా. సిస్టర్ లావణ్య, అధ్యాపకులు గౌతమి, తేజశ్రీ, రవితేజ, లావణ్య లక్ష్మి, భవ్య మాధురి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా వరి నాట్లు వేస్తూ దేశీయ వరి సాగు ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించుకున్నారు.