18వ వార్డులో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్.. ప్రజా సమస్యలపై ఆరా

అచ్చంపేట (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలోని 18వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మార్నింగ్ వాక్ నిర్వహించారు. వార్డులో పర్యటిస్తూ స్థానికులతో నేరుగా మాట్లాడి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేట అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ప్రతి వార్డులో దశలవారీగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో మార్నింగ్ వాక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.