Anakapalli | రియాక్టర్ వద్ద రసాయనం లీక్..

Anakapalli | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ ఫార్మాసిటీలో ఇవాళ‌ అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మాసిటీలోని శ్రీ సాయి చందన సంస్థ ప్రొడక్షన్ బ్లాక్-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రొడక్షన్ బ్లాక్-2లోని రియాక్టర్ వద్ద రసాయనం లీక్ కావడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా నియంత్రించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.