తిరుపతమ్మ అమ్మవారికి తొలి సారె సమర్పించిన ఆలయ ఉద్యోగులు
పెనుగంచిప్రోలు,( ఆంధ్రప్రభ): ఆషాడ మాసంలో ఆలయ ఉద్యోగులు తొలి సారె సమర్పించడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. ముఖ్యంగా మండల కేంద్రంలో ప్రభుత్వ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.ఆలయ అర్చకులు, వేద పండితులు, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు తొలి అధికారిక సారెను అమ్మవారికి అమ్మవారితో పాటు ఆలయంలోని సహదేవతలకు సారె సమర్పిస్తారు.పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, చలిమిడి, పూలు, గోరింటాకు వంటి మంగళకరమైన వస్తువులను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సారె సమర్పణతో పాటు అమ్మవారికి ఈ ఆషాడ మాసంలో శాకాంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ముందుగా ఆలయ అధికారులు వారి కుటుంబ సభ్యులు సినిమాలు సెంటర్ వద్దనున్న రంగుల మండపం నుండి సారే తీసుకొని ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు నడుమ పలు రకాల కళాకారుల వేషధారణలో కనుల పండుగ గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సహదేవతలకు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
