గృహ నిర్బంధంలోనూ నిరాహార దీక్ష కొనసాగిస్తా: ఎమ్మెల్యే
భీమ్‌గల్ (ఆంధ్రప్రభ): భీమ్‌గల్ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన తన కఠోర నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని, జైలుకు పంపినా ప్రజల కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 75 శాతం పూర్తయిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ వెజ్–నాన్ వెజ్ మార్కెట్, భీమ్‌గల్ బస్ డిపో పునఃప్రారంభం, రూ.12 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా చేపట్టిన నిరసనను ప్రభుత్వం పోలీసు బలగాలతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. తన నివాసం వద్ద వందలాది మంది పోలీసులను మోహరించి గృహ నిర్బంధం చేయడమే కాకుండా, బీఆర్ఎస్ కార్యకర్తలను పలుచోట్ల అదుపులోకి తీసుకున్నారని, భీమ్‌గల్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి ఫ్లెక్సీలను చించివేశారని విమర్శించారు. ప్రభుత్వం పెండింగ్ అభివృద్ధి పనులను ఒకటి లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని, లేదంటే గృహ నిర్బంధంలోనైనా, పోలీస్ స్టేషన్‌లోనైనా, జైలులోనైనా తన సత్యాగ్రహ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
