కోహ్లీ కోసం ఈ రికార్డులు వెయిటింగ్..!
- 177 రోజుల తర్వాత వన్డేల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ
- 300వ వన్డేలో విరాట్..
- 9 పరుగులు చేస్తే అరుదైన ఘనత
- 968 రోజుల తర్వాత మళ్లీ ఒకే వన్డే జట్టులో రోహిత్–కోహ్లీ–బుమ్రా
ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్ : కింగ్ ఈజ్ బ్యాక్..! టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 177 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే క్రికెట్‌లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ.. తన కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. కోహ్లీ చివరిసారిగా ఈ ఏడాది జనవరి 18న న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత దాదాపు ఆరు నెలల విరామం అనంతరం మళ్లీ భారత వన్డే జెర్సీలో కనిపించాడు. వన్డేల్లో కోహ్లీ రీ-ఎంట్రీతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
968 రోజుల తర్వాత ‘త్రిమూర్తులు’ కలిసి..
ఇంగ్లండ్ తో జరుగుతున్న నేటి మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వన్డే జట్టులో కలిసి బరిలోకి దిగారు. దాదాపు 968 రోజుల తర్వాత ఈ ముగ్గురు ఒకే వన్డే జట్టులో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇక 300వ వన్డే ఆడుతున్న కోహ్లీ కోసం రికార్డులు కూడా ఎదురుచూస్తున్నాయి. బ్యాట్‌తో కింగ్ గర్జిస్తే.. అరుదైన ఘనతలు అతడి ఖాతాలో చేరనున్నాయి.
కోహ్లీ కోసం వెయిటింగ్‌లో ఉన్న రికార్డులివే..!
- వన్డేల్లో 15 వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 203 పరుగులు
- ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కేవలం 9 పరుగులు
- మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులకు మరో 81 పరుగులు
- ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు 150 పరుగులు
- ఇంగ్లండ్‌పై భారత బ్యాటర్‌గా అత్యధిక అంతర్జాతీయ శతకాల రికార్డుకు మరో 2 సెంచరీలు
- లిస్ట్-ఏ క్రికెట్‌లో ఆల్‌టైమ్ అత్యధిక శతకాల రికార్డును అందుకునేందుకు మరో 2 సెంచరీలు
- ఇంగ్లండ్‌పై భారత బ్యాటర్‌గా అత్యధిక 50కి పైగా స్కోర్ల రికార్డుకు మరో ఒక్క అర్ధశతకం లేదా అంతకంటే ఎక్కువ స్కోరు
మొత్తంగా విరాట్ కోహ్లీ చుట్టూ రికార్డుల సందడి నెలకొంది. నేటి మ్యాచ్‌లో కింగ్ బ్యాట్ గర్జిస్తే.. మరో అరుదైన రికార్డు అతడి ఖాతాలో చేరడం ఖాయం.
