బీజేపీ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది

ప్రత్యేక హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతోనే ఎన్నికలకు వెళ్తాం : మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : బీజేపీ 12 ఏళ్ల పాలనలో విదేశీ అప్పులను భారీగా పెంచి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ఆరోపించారు. మంగళవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విదేశీ అప్పులు రూ.50 లక్షల కోట్ల మేర ఉండగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి రూ.150 లక్షల కోట్లకు చేరాయని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.60 ఉండేవని, ప్రస్తుతం అవి భారీగా పెరిగాయని అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ హయాంలో రూ.350 ఉండగా, ఇప్పుడు రూ.1,000కు చేరిందని పేర్కొన్నారు. కోడిగుడ్లు, బియ్యం, పప్పులు, వంటనూనెలు, ఎరువులు తదితర నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యులకు అందని స్థాయికి చేరాయని విమర్శించారు.

అయోధ్య రామమందిరం పేరుతో వేల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో సేకరించారని, ఆ నిధుల లెక్కలు అడిగితే బీజేపీ నాయకులు సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి అందిస్తామన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు.

ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో భారత రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే సమాచారం తమకు అందిందని చింతామోహన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతు రుణాలు మాఫీ చేశామని, అయితే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పనను ప్రధాన ఎన్నికల హామీలుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ సవరణ ద్వారా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ, జాతీయ అంశాలపై స్పందిస్తూ చిన్నారుల మరణాల వంటి విషాద ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కొనసాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా అభివృద్ధికి చెప్పుకోదగ్గ పనులు చేయలేదని చింతామోహన్ విమర్శించారు.

ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పరదేశి తదితరులు పాల్గొన్నారు.