అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను భ్రమరాంబిక అమ్మవారికి సమర్పణ
వారం రోజుల పాటు మగ్గంపై నేసిన అరుదైన చేనేత కళాఖండం.. సిరిసిల్ల కళాకారుడు విజయ్ కుమార్ అద్భుత సృష్టికి ప్రశంసలు
నంద్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడిపోయే అరుదైన చేనేత పట్టుచీరను మంగళవారం సమర్పించారు. ఈ ప్రత్యేక పట్టుచీరను తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు, కళారత్న నల్ల విజయ్ కుమార్ దేవస్థానానికి అందజేశారు.
దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు ఈ ప్రత్యేక పట్టుచీరను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యురాలు కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల పాటు మగ్గంపై శ్రమించి ఈ ప్రత్యేక పట్టుచీరను రూపొందించినట్లు తెలిపారు. చీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు కాగా, బరువు సుమారు 200 గ్రాములు మాత్రమే ఉంటుందన్నారు. సంప్రదాయ ఇక్కత్ నమూనాలో రూపొందించిన ఈ పట్టుచీరను ప్రత్యేక పద్ధతిలో మడతపెడితే చిన్న అగ్గిపెట్టెలో సైతం సులభంగా ఇమిడిపోతుందని వివరించారు. శ్రీ భ్రమరాంబిక అమ్మవారి అనుగ్రహంతోనే ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించగలిగినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ ప్రతిభను అభినందించారు. చేనేత కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ఈ పట్టుచీర నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని, అది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా తరతరాలుగా వస్తున్న గొప్ప కళ అని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలు కళాకారుల సృజనాత్మకత, నైపుణ్యం, అంకితభావానికి ప్రతీకలని చెప్పారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
వస్త్ర సమర్పణ చేసిన విజయ్ కుమార్, ఆయన బృందానికి దేవస్థానం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
