విద్య, క్రీడల్లో విద్యార్థులు రాణించాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: విద్య, క్రీడలు రెండింటిలోనూ ప్రతిభ కనబరిచేలా విద్యార్థులు ఎదగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్.. విద్యా ప్రమాణాలు, క్రీడా శిక్షణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

నాలుగో, ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్లం, తెలుగు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. జాతీయ జెండా, అశోక ధర్మచక్రం ప్రాధాన్యతపై విద్యార్థులు చెప్పిన సమాధానాలను అభినందించారు. విద్యార్థుల సహజ ప్రతిభను గుర్తించి ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, కోచ్‌లకు సూచించారు.
విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, వసతి తదితర సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, భోజనశాల, వంటశాల, వసతి గృహాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి పలు సూచనలు చేశారు. నాలుగో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రోత్సహించారు.
అనంతరం జేఎన్‌ఎస్‌లోని జిమ్ హాల్, ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడా మౌలిక సదుపాయాలను పరిశీలించారు. రూ.70 లక్షలతో చేపడుతున్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్విమ్మింగ్ పూల్ పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోని స్విమ్మింగ్ పూల్‌ను కూడా కలెక్టర్ పరిశీలించారు. మరమ్మత్తు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన నిర్వహణ చేపట్టాలని, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ప్రశాంత్, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, రవికుమార్, డీఈ రాజ్‌కుమార్, యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
