గ్రామకంఠం ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 4వ వార్డులో గ్రామకంఠం ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై ప్రజావాణిలో ఫిర్యాదు అందిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం సర్పంచ్ రేణుక భరత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది సంబంధిత స్థలాన్ని పరిశీలించి హద్దులను గుర్తించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ భూమి అని సూచించే హెచ్చరిక బోర్డుతో పాటు సర్వే రాళ్లను ఏర్పాటు చేశారు.

ఇటీవల ఇదే స్థలంలో అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం నిర్మాణ పనులను నిలిపివేశారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గ్రామకంఠం భూములను శాశ్వతంగా పరిరక్షించేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్థానికులు కోరారు.