వర్షాలు సమృద్ధిగా కురవాలని చండీ హోమం
కరిమాబాద్ (ఆంధ్రప్రభ): వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ 34వ డివిజన్ శివనగర్‌లోని భక్త మార్కండేయ దేవాలయంలో మంగళవారం చండీ హోమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు అభిషేక్ శర్మ మాట్లాడుతూ చండీ హోమం నిర్వహించడం వల్ల ఆ ప్రాంతంలో సుభిక్షం నెలకొని సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనంతరం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, డివిజన్ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
