గరిసెల కుంట మత్తడిని వెంటనే మరమ్మతు చేయాలి..
- చిట్యాల వీరన్న
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ ప్రజల జీవనాధారమైన చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలంగాణ వాచ్‌డాగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్యాల వీరన్న విమర్శించారు.
శుక్రవారం కేసముద్రంలోని పెద్దాయి చెరువు కింద ఉన్న గరిసెల కుంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుంట అలుగు (మత్తడి) తెగిపోయి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. అలుగు దెబ్బతినడంతో వర్షపు నీరు నిల్వ కాకుండా వృథాగా వెళ్లిపోతోందని, దీంతో రైతులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుంటలో నీటి నిల్వ లేకపోవడంతో భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్నాయని, సమీపంలోని బావులు, బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా రైతులు సాగునీటి కొరతతో పాటు తాగునీటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అత్యవసరమైన నీటి వనరుల పరిరక్షణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం చేయకుండా గరిసెల కుంట అలుగుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు ప్రారంభించాలని చిట్యాల వీరన్న విజ్ఞప్తి చేశారు.
