ఆటిజం చిన్నారులకు మెరుగైన సేవలే లక్ష్యం

ఉచితంగా నాణ్యమైన చికిత్స, శిక్షణ..

స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ నిపుణులను త్వరలో నియమిస్తాం : కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న సమగ్ర ఆటిజం సహాయక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో శిక్షణ పొందుతున్న చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి అందుతున్న బోధన, చికిత్సా సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశమైన కలెక్టర్ వారి ఆర్థిక పరిస్థితులు, పిల్లల అభివృద్ధిలో కనిపిస్తున్న మార్పులు, కేంద్రంలో అవసరమైన అదనపు సౌకర్యాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో పిల్లల్లో ఎలాంటి మార్పులు రావాలని ఆశిస్తున్నారో కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.

దూర ప్రాంతాల నుంచి కేంద్రానికి రావడం ఇబ్బందిగా ఉందని, రవాణా సౌకర్యం కల్పించాలని కొందరు తల్లిదండ్రులు కోరగా, ఆ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే ప్రతి విద్యార్థికి సదరం ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా అనే విషయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రైవేట్ కేంద్రాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమగ్ర ఆటిజం సహాయక కేంద్రంలో ఉచితంగా నాణ్యమైన సేవలు అందుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నందుకు కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ నిపుణులను త్వరలోనే నియమిస్తామని, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు అవసరమైన మరిన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, టీసీహెచ్‌ఎస్ పద్మావతి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్, సమగ్ర ఆటిజం సహాయక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.