Sensex | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా బలహీనపడటంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగింది.

మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత సెషన్ ముగింపు స్థాయి 77,616తో పోలిస్తే సెన్సెక్స్ ప్రారంభంలో దాదాపు 400 పాయింట్లు కోల్పోయింది. అనంతరం స్వల్పంగా కోలుకున్నప్పటికీ ఉదయం 9:30 గంటలకు 329 పాయింట్ల నష్టంతో 77,287 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ కూడా ఇదే బాటలో నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 71 పాయింట్లు క్షీణించి 24,139 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.14కు పడిపోవడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరగడం దిగుమతుల వ్యయం పెరుగుతుందనే ఆందోళనను పెంచుతోంది.

ఈరోజు ట్రేడింగ్‌లో బయోకాన్, కంటైనర్ కార్పొరేషన్, ఎంసీఎక్స్ ఇండియా, నాల్కో, ఆస్ట్రాల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఎల్ అండ్ టీ ఫైనాన్స్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, అశోక్ లేలాండ్, లోధా డెవలపర్స్, చోలా ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.

రంగాల వారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 429 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 186 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమాసియా పరిస్థితులు, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ పెట్టుబడిదారుల వ్యవహార శైలి మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.