లింక్డ్‌ఇన్ లెర్నింగ్‌తో ఎంబీయూ ఒప్పందం..

తిరుపతి : భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన మోహన్ బాబు యూనివర్సిటీ (ఎం.బి.యు), ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన లింక్డ్‌ఇన్ లెర్నింగ్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీంతో విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు వివిధ విభాగాలలో నిపుణుల నేతృత్వంలోని 22,000 కు పైగా కోర్సులను యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుంది.

అకడమిక్ విద్యకు తోడుగా… పరిశ్రమలకు అవసరమైన అభ్యసన, అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతలు, ఆచరణాత్మక నైపుణ్యాలను ఇది అందిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ స్థాయి ఉద్యోగ రంగంలో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం, సామర్థ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేసి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ చొరవ ప్రధాన లక్ష్యం.

ఈ ప్లాట్‌ఫామ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, నాయకత్వం, వ్యవస్థాపకత, కమ్యూనికేషన్, ఇతర సరికొత్త సాంకేతికతలలో కోర్సులను అందిస్తుంది. కృత్రిమ మేధస్సు పరిశ్రమల రూపురేఖలను, వర్క్‌ఫోర్స్ అంచనాలను మార్చేస్తున్నందున, విద్యార్థులకు జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ-అసిస్టెడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్, ఏఐ-డ్రివెన్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి ప్రత్యేక అభ్యసన మార్గాలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.

భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను నిర్మించుకోవడానికి, నిరంతరం మారుతున్న ప్రొఫెషనల్ వాతావరణంలో పోటీని తట్టుకుని నిలబడటానికి ఇది వారికి సహాయపడుతుంది. సాంకేతిక విజ్ఞానానికి అతీతంగా.. పరిశ్రమలు, యజమానులు ఎక్కువగా కోరుకుంటున్న నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, భావ వ్యక్తీకరణ, సహకారం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే తత్వం వంటి కార్యాలయ నైపుణ్యాలను విద్యార్థులు బలోపేతం చేసుకోవడానికి లింక్డ్‌ఇన్ లెర్నింగ్ తోడ్పడుతుంది.

విద్యార్థులు తమకు అవసరమైన వ్యక్తిగతీకరించిన అభ్యసన మార్గాలను ఎంచుకోవచ్చు, పరిశ్రమలచే గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లను పొందవచ్చు, ఆ విజయాలను తమ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రొఫెషనల్‌గా తమ గుర్తింపును మరింత పెంపొందించుకోవచ్చు.

అధునాతన సాంకేతిక శిక్షణ కోసం రూపొందించిన ఫ్లాగ్‌షిప్ ‘టాప్ గన్’ ప్రోగ్రామ్, ఏఓఎన్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ‘కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్లేస్‌మెంట్ రెడీనెస్’ (సిఇపిపిఆర్) వంటి బలమైన పునాదులపై నిర్మించబడిన మోహన్ బాబు యూనివర్సిటీ ఉపాధి ఎకోసిస్టమ్‌ను ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తుంది.

సిఇపిపిఆర్ ప్రోగ్రామ్ విద్యార్థులను జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వం (కెఎఎస్పి) ఆధారంగా అంచనా వేస్తుంది. వీటితో పాటుగా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, నాయకత్వం, విమర్శనాత్మక ఆలోచన, ఉద్యోగ సంసిద్ధతపై విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వీటన్నింటి ఫలితంగా టెక్నాలజీ, కన్సల్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్థిక సేవలు తదితర వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలలోని ప్రముఖ బహుళజాతి సంస్థలలో విద్యార్థులు ఉపాధి పొందగలుగుతున్నారు.

ఫార్చ్యూన్ 500, ఫోర్బ్స్ గ్లోబల్ 2000 కంపెనీలలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులతో కూడిన ఎం.బి.యు గ్లోబల్ అలుమ్ని నెట్‌వర్క్.. ఈ ఎకోసిస్టమ్‌ను మరింత సుసంపన్నం చేస్తోంది. వారి మార్గదర్శకత్వం, ఇండస్ట్రీ ఇంటరాక్షన్లు, నెట్‌వర్కింగ్ అవకాశాలు, కెరీర్ గైడెన్స్ తో విద్యార్థులు పరిశ్రమల దృక్పథాలను, వాస్తవ ప్రపంచ కెరీర్ మార్గాలను దగ్గరగా చూసే అమూల్యమైన అవకాశాన్ని పొందుతున్నారు.

ఈ భాగస్వామ్యం గురించి మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు మాట్లాడుతూ, “మోహన్ బాబు యూనివర్సిటీలో అభ్యసన అనుభవాన్ని మరింత సుసంపన్నం చేయడానికి లింక్డ్‌ఇన్ లెర్నింగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. విద్యార్థులు బలమైన అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను, విశ్వాసాన్ని పొంది, డైనమిక్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో విజయవంతమైన పట్టభద్రులుగా బయటకు వచ్చేలా చూడటమే మా ప్రధాన లక్ష్యం. మా ఆ నిబద్ధతకు ఈ భాగస్వామ్యం ఒక సహజమైన కొనసాగింపు” అని అన్నారు.

పెన్ స్టేట్ యూనివర్సిటీ, RWTH ఆచెన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు, L&T, IBM, SAP, AWS, మరియు Cisco వంటి అగ్రశ్రేణి పరిశ్రమలతో ఎం.బి.యు కుదుర్చుకున్న ఒప్పందాలు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి విద్యను అందించాలన్న వారి నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.

ఈ భాగస్వామ్యాలు విద్యార్థులకు అంతర్జాతీయ అభ్యసన అవకాశాలు, పరిశ్రమలతో అనుసంధానించబడిన పాఠ్యాంశాలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న సర్టిఫికేషన్లు, ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తూ, మారుతున్న ప్రపంచ స్థాయి ఉపాధి రంగంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేస్తున్నాయి.