జొన్నలు కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా..

కలెక్టర్‌తో వాగ్వాదం

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జొన్నలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జొన్నల కొనుగోలు విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు జిల్లా కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.

గడివేముల మండలంలోని బిలకలగూడూరు, పెసరవాయి గ్రామాలతో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. సివిల్ సప్లై అధికారులు కొనుగోలుకు అనుమతి వచ్చిందని చెబుతుంటే, కలెక్టర్ కార్యాలయం నుంచి మాత్రం అనుమతి రాలేదని చెబుతున్నారని, అసలు ఎవరి మాట నమ్మాలని రైతులు ప్రశ్నించారు.

రెండు నెలలుగా మిగిలిపోయిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నామని, గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జొన్నలు కొనుగోలు చేయకపోతే తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని, పండించిన పంట అమ్ముడుపోక నిల్వ ఉండగా, మరోవైపు ఖరీఫ్‌లో వేసిన పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలు తప్పవని హెచ్చరిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు మాట్లాడుతూ, జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు కొనుగోలుకు అనుమతి వచ్చిందని, లారీలు కూడా పంపిస్తామని చెబుతున్నారని, మరోవైపు కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతి లేదని చెప్పడం గందరగోళానికి దారితీస్తోందన్నారు. రైతులు ఎవరి మాట నమ్మాలని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి జొన్నల కొనుగోలుకు అనుమతి మంజూరైనట్లు తాజాగా సమాచారం అందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని నేడు లేదా రేపటి నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా గడివేముల మండల రైతులకు ప్రాధాన్యం ఇచ్చి కొనుగోళ్లు చేపడతామని, సంబంధిత అధికారుల ద్వారా రైతులందరికీ సమాచారం అందజేస్తామని తెలిపారు.

ఈ ధర్నాలో బిలకలగూడూరు, పెసరవాయి గ్రామాల రైతులు, గ్రామ పెద్దలు రఫీ, రామపుల్లారెడ్డి, రైతు సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.