ఎల్బీనగర్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు.. ఉద్రిక్తత
- యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్ వర్గాల మధ్య
- ఉద్రిక్త పరిస్థితులు నిరసనలు..
- రాళ్లదాడి జరిగినట్లు ఆరోపణలు..
- పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపు
ఎల్బీనగర్, ఆంధ్రప్రభ : ఎల్బీనగర్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ అనుచరుల మధ్య సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ నిరసనలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఈశ్వరమ్మ యాదవ్పై జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు రావడంతో, బీసీ సంఘాల ప్రతినిధులు, ఈశ్వరమ్మ అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నిరసనల కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈశ్వరమ్మ యాదవ్ అనుచరులు జక్కిడి శివచరణ్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్న సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రాళ్లదాడి జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడ మోహరించిన పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు స్వల్ప లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం.
ఘటన నేపథ్యంలో ఎల్బీనగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
