Rain Alert | తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్

Rain Alert | తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్

జూన్ 30 వరకు విస్తారంగా వర్షాలు

Rain Alert | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 30 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న వారం రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండొచ్చని పేర్కొన్నారు. వర్షాలతో పాటు గంటకు 30నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశాలు ఉన్న సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.

ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.