భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
తెలంగాణ సుభిక్షం, ప్రజల ఆయురారోగ్యాల కోసం స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు
వేములవాడ (ఆంధ్రప్రభ): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం ఈవో రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, కోడె మొక్కు, ఆర్జిత సేవలు నిర్వహించిన ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ మమత అజయ్ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
