నిద్రలో ఉన్న తండ్రిని గొడ్డలితో నరికి హత్య

మహాముత్తారం మండలంలో దారుణ ఘటన.. కుమారుడు పరారీ

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే నిద్రలో ఉన్న తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.

గ్రామానికి చెందిన రత్నం సారయ్య (70) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆయన కుమారుడు రత్నం రవీందర్ గొడ్డలితో దాడి చేయడంతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మృతుడికి భార్య పోచమ్మ ఉన్నారు. ఘటన అనంతరం నిందితుడు రత్నం రవీందర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.