మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడూ? ప్రతిపాదనలు పెండింగ్‌లోనే
మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడూ? ప్రతిపాదనలు పెండింగ్‌లోనే
- టేకోవర్ ఆలస్యంతో రాష్ట్రంపై రోజుకు రూ.2.5 కోట్ల వడ్డీ భారం
- ఫేజ్-2 వ్యయం రూ.38,595 కోట్లకు పెరుగుదల
- కేంద్ర అనుమతుల్లో జాప్యం.. ప్రత్యామ్నాయ నిధులపై రాష్ట్రం దృష్టి
- ఒకే యాజమాన్యంపై కేంద్రం పట్టుదల
- ప్రాజెక్టు ఆలస్యం కొనసాగితే వ్యయం మరింత పెరిగే అవకాశం
హైదరాబాద్, ఆంధ్రప్రభబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో వ్యవహారం గుదిబండగా మారుతోంది. మెట్రో టేకోవర్ గడువు తీరింది. ఎల్ అండ్ టీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకు రూ.2.5 కోట్ల వడ్డీ భారం పడుతోంది. కేంద్రం నుంచి 50:50 జాయింట్ వెంచర్ అనుమతుల్లోనూ తీవ్ర జాప్యం నెలకొంటున్నది. దీంతో ఇక స్పష్టత రాకపోతే ప్రత్యామ్నాయ నిధులతో ఫేజ్-2 పనులను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట్లు తెలిసింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై నిర్ణయాల అమలులో వేగం పెంచాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రులకు మరోమారు లేఖలు రాశారు. దానిపై ఇప్పటివరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి స్పందన లేదు. విలువను తిరిగి లెక్కించేందుకు గురువారం వరకు ఎస్బీఐ క్యాప్స్ ఇంకా ఏర్పాటు కాలేదు. సమన్వయానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారిని సైతం నియమించలేదు.
అయితే మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టులో వాటా తీసుకోవాలని కేంద్రం ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులోని ఫేజ్-1, ఫేజ్-2లు వేర్వేరు యాజమాన్యాల కింద ఉంటే నిర్వహణలో ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం చెబుతోందని, ఒకే యాజమాన్యంలో ఉంటే మేలని సూచిస్తోందని సమాచారం. ఫేజ్-1 నికర విలువ, ఫేజ్-2 అంచనాల పునఃసమీక్షకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్బీఐ క్యాప్స్‌ను అధికారిక కన్సల్టెంట్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు టర్మ్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇంకా విడుదల కాలేదు. రూ.13,527 కోట్ల రుణం సస్పెన్స్ నెలకొంది.
162.5 కిలోమీటర్ల కోసం రూ.43,848 కోట్లు…
గతేడాది అంచనాలతో పోలిస్తే మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం రూ.1,915 కోట్లు పెరిగింది. ప్రాజెక్టు ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు రెండో దశ కోసం తొలుత ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం కారిడార్ల వారీగా డీపీఆర్లను 2024 నవంబర్ 4న కేంద్రానికి సమర్పించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం మరో మూడు కారిడార్లను ప్రతిపాదించి, వాటికి సంబంధించిన డీపీఆర్‌ను 2025 జూన్ 21న కేంద్రానికి పంపింది.
ఈ ఎనిమిది కారిడార్లలో 162.5 కిలోమీటర్ల కోసం రూ.43,848 కోట్ల అంచనాను సిద్ధం చేశారు. ఇందులో ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ప్రతిపాదన కూడా ఉంది. దీనిని మినహాయిస్తే, 122.9 కిలోమీటర్ల అంచనా వ్యయం రూ.36,680 కోట్లు. దీనిపై కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లను సవరించింది. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేకపోవడంతో ఫ్యూచర్ సిటీ మెట్రోను రెండో దశ నుంచి మినహాయించారు. కేవలం ఏడు కారిడార్ల డీపీఆర్లను మాత్రమే జనవరి 2026 నాటి ధరలతో సవరించి కేంద్రానికి పంపారు.
దీని ప్రకారం 122.9 కిలోమీటర్ల అంచనా వ్యయం రూ.38,595 కోట్లకు పెరిగింది. గతంలో పంపిన డీపీఆర్ల ప్రకారం కిలోమీటరుకు నిర్మాణ వ్యయం రూ.298 కోట్ల వరకు ఉండగా, తాజాగా సవరించిన డీపీఆర్ ప్రకారం ఇది రూ.314 కోట్లకు పెరిగింది.
రూ.350 కోట్లకు పెరిగే ఛాన్స్
అంచనా వ్యయాల పెరుగుదలపై కేంద్రం వివరణ కోరగా, రాష్ట్ర ప్రభుత్వం అందుకు కారణాలను వివరించింది. ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా అనుమతులు ఇవ్వాలని కూడా కోరింది. మరింత ఆలస్యం జరిగితే, కిలోమీటరుకు నిర్మాణ వ్యయం రూ.350 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.40 వేల కోట్లు దాటుతుంది. అంతేకాకుండా, రెండవ దశకు అనుమతులు పొందాలంటే, ప్రభుత్వం ప్రాజెక్టు మొదటి దశపై 100 శాతం యాజమాన్యాన్ని తీసుకోవాలి. ఇది జరగాలంటే ఒప్పందం ప్రకారం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ త్వరగా రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది.
సమన్వయం సమస్యలపై సందేహాలు
మెట్రోరైలు ఫేజ్-1లోని ఎల్ అండ్ టీ వాటాను 100 శాతం కొనుగోలు చేశాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తిస్థాయి యాజమాని అవుతుంది. విస్తరణలో భాగంగా చేపట్టనున్న ఫేజ్-2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ సమయంలో సమన్వయ సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరిస్తారంటూ కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగింది. ఫేజ్-2 పూర్తయిన మూడేళ్ల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక అవగాహనకు రావొచ్చని రాష్ట్రం సమాధానమిచ్చింది.
కేంద్రం మాత్రం రెండు దశల ప్రాజెక్టులు ఒకే యాజమాన్యం కింద ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. దేశంలోని అన్ని మెట్రో రైళ్లు ఈ విధానంలో నడుస్తున్నాయని గుర్తుచేస్తోంది. అందుకే ఫేజ్-1లో భాగస్వామి కావాలని ఆసక్తి చూపిస్తోందని సమాచారం. అదే జరిగినట్లయితే మెట్రోకి హైదరాబాద్‌లో ఉన్న 269 ఎకరాల భూములు, మాల్స్, ఇతరత్రాలన్నీ ఉమ్మడి ఆస్తులుగా మారతాయి.
కేంద్రం వాటాదారుగా చేరినట్లయితే ఇదివరకు ఐఆర్ఎఫ్‌సీ ఇస్తానని చెప్పిన 3.5 నుంచి 4 శాతానికంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. మెట్రో ఫేజ్-1 నిర్వహణలో నష్టాలు రావడానికి ఏటా చెల్లిస్తున్న రూ.940 కోట్ల వడ్డీ ఒక కారణం. తక్కువ వడ్డీకి లోన్లు తెస్తే ఈ భారం తగ్గుతుంది. గతంలో ఎల్ అండ్ టీ మెట్రోరైలు (హైదరాబాద్) లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్ల వడ్డీలేని లోన్ (సాఫ్ట్ లోన్) ఇచ్చింది. మదింపులో ఈ మొత్తాన్ని మినహాయించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఇది కూడా మెట్రో ఫేజ్-1 విలువను తిరిగి మదింపు చేసేందుకు ఒక కారణమని సమాచారం.
సంయుక్త ప్రాజెక్టుల్లో వాటాలు ఇలా…
మెట్రో రైలు చట్టంలో ఇటీవల చేసిన మార్పుల ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతం, రాష్ట్రం వాటా 20 శాతం, లోన్ల ద్వారా 60 శాతం నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేంద్రం వాటా 20 శాతం అని చెబుతున్నప్పటికీ భూసేకరణ, నిర్మాణ సమయంలో వడ్డీల ఖర్చును తెలంగాణ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం వాటా 18 శాతమే ఉంటుందని సమాచారం. ఫేజ్-1లో కేంద్రం వాటాను తీసుకున్నట్లయితే మెట్రో తొలి రెండు దశలూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు అవుతాయి. అప్పుడు బోర్డులో కేంద్రం, రాష్ట్రం తరఫున అధికారులు డైరెక్టర్లుగా ఉంటారు. సమన్వయంతో ప్రాజెక్ట్ పరుగులు పెడుతుందని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
