భారత్ కు ఐదు గోల్డ్ మెడల్స్…
- ప్రపంచానికి భారత మేధస్సు చాటిన విద్యార్థులు..
- IPhOలో భారత్ నంబర్-1
- వరల్డ్ నంబర్-1 ర్యాంక్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో భారత విద్యార్థులు మరోసారి తమ మేధస్సును చాటుకున్నారు. ఈ ఏడాది ఫిజిక్స్ ఒలింపియాడ్ కొలంబియాలోని బుకారామంగా నగరంలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొన్నారు. అయితే, భారత జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అన్ని విభాగాల్లో మెరిసింది. కొలంబియాలో నిర్వహించిన 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO)–2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. పోటీలో పాల్గొన్న ఐదుగురు భారత విద్యార్థులూ స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.
స్వర్ణ పతకాలు సాధించిన భారత విద్యార్థులు..
కనిష్క్ జైన్ – పుణె, మహారాష్ట్ర
రిద్ధేశ్ అనంత్ బెందాలే – ఇండోర్, మధ్యప్రదేశ్
రిషిత్ గార్గ్ – ద్వారక, న్యూఢిల్లీ
శ్రేష్ఠ్ సురయ్యా – ముంబై, మహారాష్ట్ర
స్వరిత్ జోషి – అహ్మదాబాద్, గుజరాత్
ఈ ఐదుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించడంతో భారత్ మొత్తం జట్టు ప్రదర్శనలో ప్రపంచ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ప్రపంచ నంబర్-1గా భారత్
ఈ పోటీల్లో భారత్… చైనా, కజకిస్థాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలతో కలిసి సంయుక్తంగా ప్రపంచ నంబర్-1 ర్యాంక్‌ను సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో భారత విద్యార్థుల శాస్త్రీయ ప్రతిభకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాల్లో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి అంతర్జాతీయ ఒలింపియాడ్లలో భారత విద్యార్థులు వరుస విజయాలు సాధిస్తూ దేశ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నారు.
