ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ పోరు..!

  • సెమీస్ సమరానికి అంతా సిద్ధం
  • ఫ్రాన్స్-స్పెయిన్.. ఇంగ్లండ్-అర్జెంటీనా అమీతుమీ

ఆంధ్రప్రభ, క్రీడా విభాగం : ఫిఫా వరల్డ్ కప్-2026 తుది అంకానికి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ ముగియడంతో ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరిన నాలుగు అగ్ర జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు.. మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ జ‌ట్లు టైటిల్ వేటలో మిగిలాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టి ఇప్పుడు ఈ నాలుగు జట్లపై నిలిచింది.

కాగా, తొలి సెమీఫైనల్ జూలై 15న (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీపడనున్నాయి.

మరుసటి రోజు జూలై 16న (అర్ధరాత్రి 12:30 గంటలకు) ఇంగ్లండ్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తలపడనున్నాయి. సెమీఫైన‌ల్-1, సెమీఫైన‌ల్-2 లో గెలిచిన జట్లు జూలై 20న జరిగే ఫైనల్‌లో టైటిల్ కోసం పోటీ పడతాయి. ఓడిన జట్లు ఫైన‌ల్స్ కు ఒక‌రోజు ముందే (జూలై 19న) మూడో స్థానం కోసం ప్లేఆఫ్ మ్యాచ్ ఆడనున్నాయి.

సెమీస్‌లో వీరిపైనే అందరి చూపు..

ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ అంటేనే స్టార్ ప్లేయర్ల సమరం. ఈసారి కూడా ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న దిగ్గజాలు ఒకే వేదికపై తలపడుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్రాన్స్ తరఫున కిలియన్ ఎంబాప్పే, స్పెయిన్ నుంచి యువ సంచలనం లామిన్ యమాల్, ఇంగ్లండ్‌కు జూడ్ బెల్లింగ్‌హామ్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు లియోనెల్ మెస్సీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. తొలి సెమీఫైనల్లో ఎంబాప్పే-యమాల్ పోరు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. రెండో సెమీస్‌లో మెస్సీ-హ్యారీ కేన్ సమరం అంతే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా.. మెస్సీ చివరి మిషన్?

ఖతార్ ఫిఫా ప్రపంచకప్ 2022ను గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, 2026 ప్రపంచకప్‌లోనూ టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న అర్జెంటీనా.. ఇప్పుడు వరుసగా రెండోసారి, మొత్తంగా నాలుగో ప్రపంచకప్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. 1978, 1986, 2022లో ప్రపంచకప్‌ను గెలిచిన అర్జెంటీనా.. 2026లో మరోసారి కప్ సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన అరుదైన జట్ల జాబితాలో చేరనుంది.

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి 2026 ప్రపంచకప్ చివరిదిగా నిలిచే అవకాశం ఉంది. టోర్నీ సమయానికి మెస్సీ వయసు 39 సంవత్సరాలు ఉంటుంది. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చని మెస్సీ గతంలోనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో అభిమానుల దృష్టి మొత్తం ఈ మెగా టోర్నీపైనే నిలిచింది.

మెస్సీతో పాటు జూలియన్ ఆల్వారెజ్, ఎంజో ఫెర్నాండెజ్, అలెక్సిస్ మెక్ అలిస్టర్, స్టార్ గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నారు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమతూకంతో అర్జెంటీనా మరోసారి బలమైన జట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు నాలుగో ప్రపంచకప్ టైటిల్, మరోవైపు మెస్సీకి చిరస్మరణీయ వీడ్కోలు ఇవ్వాలనే లక్ష్యంతో అర్జెంటీనా ఈసారి బరిలోకి దిగుతోంది. అభిమానులు కూడా మరోసారి మెస్సీ చేతుల్లో ప్రపంచకప్ ట్రోఫీని చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.