నందీశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం

-పాత శివాలయంలో వైభవంగా ప్రదోష పూజలు
-భక్తుల సమక్షంలో ప్రత్యేక అభిషేకాలు, పంచహారతులు

భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడ వన్‌టౌన్‌లోని ద్వాపరయుగంలో ధర్మరాజు ప్రతిష్ఠించినట్లు విశ్వసించే శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (పాత శివాలయం)లో ఆదివారం ప్రదోషకాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జ్యేష్ఠ బహుళ త్రయోదశి సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీ నందీశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అనంతరం పంచహారతులు వైదిక పద్ధతిలో నిర్వహించారు.

ఉభయదాతలకు మంత్రపుష్పం, ఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం సమక్షంలో ఆలయ అర్చకులు నాగరాజు శర్మ, అభిషేక పండిత్ కొత్తపల్లి సాయికృష్ణ శర్మ, సహాయక అర్చకుడు నాదెళ్ల లక్ష్మీ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.