ప్రతిభకు పట్టం… విద్యార్థులకు ఘన సన్మానం…

ప్రతిభకు పట్టం… విద్యార్థులకు ఘన సన్మానం…
విజయవాడ, ఆంధ్రప్రభ
విద్యలో ప్రతిభ కనబరచడం ఎంత ముఖ్యమో, సమాజానికి సేవ చేయడం కూడా అంతే అవసరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అహ్మద్ షరీఫ్ అన్నారు. విజయవాడ వించిపేట గాంధీ బొమ్మ సెంటర్‌లో శుక్రవారం మర్కజ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పదో తరగతిలో విశేష ప్రతిభ కనబర్చిన 11 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి జ్ఞాపికలతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన అహ్మద్ షరీఫ్‌తో పాటు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా విద్యార్థులను అభినందిస్తూ పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా నిలవడం రాష్ట్ర విద్యారంగ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించినట్లే జీవితంలో కూడా మానవీయ విలువలు పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.
అనంతరం మొహమ్మద్ ఫతావుల్లా మాట్లాడుతూ.. విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషి, ప్రభుత్వ పర్యవేక్షణ, విద్యా రంగంలో తీసుకున్న సంస్కరణలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని అభిప్రాయపడ్డారు. సంస్థ విద్యార్థుల అభ్యున్నతి కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సేవాభావం కూడా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అహ్మద్ మొహమ్మదీ, మత పెద్దలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, సామాజిక సేవకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
