తిమ్మారెడ్డిపల్లి పైతండాలో తాగునీటి కటకట..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి పైతండాలో గత నాలుగు రోజులుగా తాగునీటి తీవ్ర ఎద్దడి నెలకొనడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో మహిళలు, చిన్నారులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో మహిళలు కిలోమీటర్ దూరం కాలినడకన నడిచి, కొందరు ఆటోల ద్వారా వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తున్నారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు కూడా సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతుండగా, అదే బోర్ల నుంచి తాగునీరు తీసుకెళ్లాల్సి రావడంతో కొందరు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తండావాసులు తెలిపారు.తాగునీటి సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.ఎండాకాలం ముగిసినా వర్షాలు కురవకపోవడంతో నీటి వనరులు అడుగంటిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు స్పందించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని తిమ్మారెడ్డిపల్లి పైతండా ప్రజలు విజ్ఞప్తి చేశారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ సరిచేస్తాం.
ఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి పైతాండాకు నారాయణపేట మండల పరిధిలోని లక్ష్మీపూర్ మిషన్ భగీరథ సంప్ హౌస్ నుండి కొల్లంపల్లి మీదుగా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా కొల్లంపల్లి వద్ద పైప్ లైన్ లీకేజీ ఏర్పడడంతో నీటి ఎద్దడి నెలకొందని మిషన్ భగీరథ ఏఈ నరేందర్ ఆంధ్రప్రభ కు తెలిపారు. పైప్ లైన్ మరమ్మత్తు పనులు చేపట్టి నీటి సమస్య తీరుస్తామని అన్నారు.
