గుంటూరు కుర్రాళ్ల బ్యాట్ జోరు..
ప్రమోద్ డబుల్ సెంచరీ, రోహిత్ శతకం
549 పరుగులకు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్.. గెలుపు అంచున గుంటూరు జిల్లా జట్టు
గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నవులూరులో జరుగుతున్న అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో గుంటూరు జిల్లా బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో దేవ ప్రమోద్ 271 పరుగులతో డబుల్ సెంచరీ సాధించగా, వీవీ రోహిత్ 139 పరుగులతో శతకం బాదాడు. వీరి భారీ ఇన్నింగ్స్‌లతో గుంటూరు జిల్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 549 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రకాశం జిల్లా జట్టు 132 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. దీంతో గుంటూరు జిల్లా జట్టు విజయానికి మరో అడుగు దూరంలో నిలిచిందని త్రీమెన్ కమిటీ సభ్యుడు నాగరాజు తెలిపారు.
ఇటీవలి కాలంలో రాష్ట్రస్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా క్రికెటర్లు వరుస విజయాలతో తమ ప్రతిభను నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విజయాల వెనుక కృషి చేసిన కోచ్‌లు, త్రీమెన్ కమిటీ సభ్యులు కృష్ణ, శరత్, నాగరాజును పలువురు అభినందించారు.
