Komuravelli Railway Station | కొమురవెల్లిలో 26న రైల్వే స్టేషన్ ప్రారంభం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
అదే రోజు నుంచి సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రెండు జతల రైళ్లు
Komuravelli Railway Station | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ఈ నెల 26న ప్రజలకు అందుబాటులోకి రానుంది. సుమారు రూ.5.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అదే రోజు సాయంత్రం 3 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు.
స్టేషన్ ప్రారంభమైన రోజే సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలో కొమురవెల్లి మీదుగా రోజుకు రెండు జతల రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. భక్తుల రద్దీ, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా రైల్వే శాఖ పరిశీలించనుంది. అలాగే స్టేషన్‌లో అదనపు ప్రయాణికుల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కమిటీ అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో రోడ్డు మార్గంతో పాటు రైలు మార్గంలోనూ పుణ్యక్షేత్రానికి సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది మల్లన్న భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని భావిస్తున్నారు.
