ఎస్. జానకి మృతికి తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దిగ్గజ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి మరణం పట్ల తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో, “స్వర సరస్వతి మౌనమైంది… కోకిల గానం కాలగర్భంలో కలిసిపోయింది… తెలుగు గుండెల్లో శాశ్వతంగా మారుమోగే ఆ మధుర స్వరం నేడు మౌనమైంది” అని పేర్కొంది. తరతరాల సంగీతాభిమానులను తన గానామృతంతో అలరించిన ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికే కాకుండా ప్రతి సంగీత ప్రేమికుడికి తీరని విషాదాన్ని మిగిల్చిందని తెలిపింది.

ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకమని, ప్రతి రాగం ఒక అనుభూతి అని, ప్రతి ఆలాపన శ్రోతల హృదయాలను తాకే ఆత్మస్పర్శ అని కొనియాడింది. వెండితెరపై నటీనటులు పలికిన భావాలకు తన అపూర్వ గానంతో ప్రాణం పోసిన మహోన్నత గాయని ఎస్. జానకి అని పేర్కొంది. ప్రేమకు పరిమళంగా, విరహానికి వేదనగా, భక్తికి మధుర స్వరంగా, తల్లిప్రేమకు మమతగా ఆమె గానం కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపింది. “నేడు ఒక గాయని ప్రస్థానం మాత్రమే కాదు… ఒక స్వరయుగం ముగిసింది. ఒక మధుర గాననది నిశ్శబ్దమైంది. అయితే ఆమె స్వరం మాత్రం కాలాన్ని జయిస్తూ శాశ్వతంగా మారుమోగుతూనే ఉంటుంది. పాట ఆగిపోయింది… కానీ ఆ స్వరం ఆగదు. శరీరం దూరమైంది… కానీ సంగీతం అమరమైంది” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మహోన్నత గాయని ఎస్. జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సంగీత ప్రపంచానికి, అభిమానులందరికీ తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

“సంగీతానికి మరణం లేదు… మంచి మనుషులకు మరుపు లేదు… ఎస్. జానకి గారూ… మీ గానం మా గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోతుంది” అని పేర్కొంటూ, ఆమె మరణం తెలుగు సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సంతాప సందేశంపై అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల జె.వి. ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి సంతకాలు చేశారు.