నిలిచిపోయిన మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయాలి: కోన రఘుపతి
బాపట్ల ఆంధ్రప్రభ : బాపట్ల ముద్దుబిడ్డ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొన ప్రభాకర్ రావు 110వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన విద్య, సాగునీటి రంగాల్లో అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ.. బాపట్లలో నిలిచిపోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 56 ఎకరాల్లో రూ.442 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు నిలిచిపోయాయని, నిర్మాణ స్థలం నుంచి ఇనుప రాడ్లు చోరీకి గురవుతున్నాయని ఆరోపించారు.
మెడికల్ కాలేజీ ముందు చెత్త డంపింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చెత్త యార్డును ఇతర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే బాపట్ల జిల్లా ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి జరిగిందని, గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తోందని అన్నారు.

