శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు కీలకం

  • మరో 700 సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం
  • యువత డ్రగ్స్, సైబర్ గేమింగ్ అలవాట్లకు దూరంగా ఉండాలి..
  • క్రీడలపై దృష్టి సారించాలి..
  • కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

గన్నేరువరం, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని ఖాసీంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 09 సీసీ కెమెరాలను, పరువెల్ల గ్రామంలోని 08 సీసీ కెమెరాలను, గునుకులు కొండాపూర్ గ్రామంలో 04 కెమెరాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గన్నేరువరం పోలీసుల ఆధ్వర్యంలో ఖాసీం ఎటలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాసీంపేటలో విద్యార్థులు, ప్రజలతో ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి గ్రామం, పట్టణం మరియు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమన్నారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సైబర్ నేరాలు – ఆన్లైన్ గేమింగ్ ముప్పు ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్లైన్ గేవి యంగ్ బారిన పడి డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని, యువత మత్తుకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం రహవీర్ పథకం కింద రూ. 25,000 నగదు పురస్కారం అందిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఖాసీంపేట సర్పంచ్ చంద్రయ్య, పరువెల్ల గ్రామ సర్పంచ్ లక్ష్మి రాంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, గన్నేరువరం ఎస్సై ఆవుల నరేందర్ రెడ్డిలతోపాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.