బావిలో పడి విద్యార్థి మృతి..

  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నకుటుంబీకులు..
  • ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడు.

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ప్రమాదవశాత్తు బావిలో పడి 11 ఏళ్ల గిరిజన విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని కామనపల్లి తాండాకు చెందిన భూక్య శ్రీనివాస్, శైలజ దంపతుల కుమారుడు భూక్య సాయి విఘ్నేష్ (11) గ్రామ సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కుటుంబంలో అతనికి 13 ఏళ్ల అక్క నిత్య ఉంది.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో ఈ ఘటన విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నారం ఎస్‌ఐ గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.