ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందొచ్చు..

  • జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

ఆయిల్‌పామ్ సాగు విస్తరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో 102 ఎకరాల్లో మెగా ఆయిల్‌పామ్ మొక్కల నాటకం చేపట్టారు. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన రైతు గౌరవెల్లి రవీందర్ రావు పొలంలో 4.5 ఎకరాల్లో నిర్వహించిన ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, మూడు సంవత్సరాల క్రితం ఆయిల్‌పామ్ సాగు ప్రారంభించిన రైతులు ప్రస్తుతం మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందుతూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతులకు ఎదురయ్యే సమస్యలను ఉద్యాన శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి, అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ పరిష్కరిస్తోందని చెప్పారు.

వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా మారుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంటగా ఆయిల్‌పామ్ మంచి ప్రత్యామ్నాయమని వివరించారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో సుమారు నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చని రైతులకు సూచించారు.

రైతులకు పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం, తోటల నిర్వహణపై పలు సాంకేతిక సూచనలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని అధిక విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమంలో తిరుమల ఆయిల్‌కెమ్ ఇండియా లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కేషు కల్యాంకర్, ఉద్యాన అధికారి మహేష్, ఉద్యాన విస్తరణ అధికారి రాము, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.