Rajpal Yadav | బాలీవుడ్ నటుడికి ఢిల్లీ హైకోర్టు షాక్..

చెక్ బౌన్స్ కేసులో.. మూడు నెలలు జైలు..

Rajpal Yadav | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసుల్లో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు దిగువ కోర్టు విధించిన మూడు నెలల సాధారణ జైలు శిక్షను హైకోర్టు సమర్థించింది.

జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించి ఈ తీర్పు వెలువరించింది. బాధితుడు దాఖలు చేసిన ఏడు వేర్వేరు ఫిర్యాదులకు సంబంధించి ప్రతి కేసులోనూ రూ.కోటికి పైగా పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే రాజ్‌పాల్ యాదవ్ ఇప్పటికే చెల్లించిన సుమారు రూ.2 కోట్ల మొత్తాన్ని తుది చెల్లింపుల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.

ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నటుడికి రెండు నెలల గడువును కూడా హైకోర్టు ఇచ్చింది. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ వివాదం తలెత్తినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నట్లు నటుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టుకు ఇచ్చిన హామీల మేరకు బకాయిలను పదేపదే చెల్లించడంలో విఫలమవడంతో శిక్షను సమర్థించిన హైకోర్టు, 2018లో మెజిస్ట్రేట్ కోర్టు, 2019లో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా నిలబెట్టింది.