పాత ఫోటోలతో.. పోలియో విధులకు డుమ్మా..!
- అధికారులను తప్పుదోవ పట్టించిన వైద్యాధికారిణి.?
- పల్స్ పోలియో కార్యక్రమానికి గైర్హాజరైన పల్లె దవాఖాన వైద్యాధికారిపై ఆరోపణలు
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో విధులకు హాజరు కాకుండా, పాత ఫొటోలను పంపించి జిల్లా అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల సబ్‌సెంటర్ పల్లె దవాఖాన వైద్యాధికారిపై వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే..

గత నెల (జూన్) 28న నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఆరోగ్య శాఖ నెల రోజుల ముందుగానే విస్తృతంగా ఏర్పాట్లు చేసి, ఆశా కార్యకర్తల నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేసింది. అయితే పిడిసిల్ల సబ్సెంటర్లో జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
అయితే సంబంధిత పల్లె దవాఖాన వైద్యాధికారి కార్యక్రమానికి హాజరు కాలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, గైర్హాజరైనప్పటికీ గత సంవత్సరం తీసిన ఫొటోలను ఎడిట్ చేసి జిల్లా అధికారులకు పంపించినట్లు సమాచారం. ఈ విషయమై గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా, తాను కార్యక్రమంలో పాల్గొన్నానని, అయితే సంబంధిత వైద్యాధికారి ఆ రోజు రాలేదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మండలంలోని సబ్సెంటర్లను పర్యవేక్షించాల్సిన మండల వైద్యాధికారి, పల్లె దవాఖాన వైద్యాధికారి వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ విషయం మెడికల్ ఆఫీసర్ని వివరణ కోరగా వారు స్పందించలేదు. కాగా.. సంబంధిత అధికారిని ఆంధ్రప్రభ రిపోర్టర్ వివరణ కోరగా వారు ఇతర పనుల్లో ఉన్నట్లు తర్వాత మాట్లాడతానని చెప్పారు. కానీ వారూ రిటర్న్ కాల్ చేయలేదు.
