కంప్యూటర్ నైపుణ్యాలే భవిష్యత్‌ బలం

  • జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌
  • పోలీసు సిబ్బందికి వోక్సెన్‌ యూనివర్సిటీలో తొలి బ్యాచ్‌ శిక్షణ ముగింపు
  • శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్ల ప్రదానం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు వోక్సెన్‌ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎంఎస్‌ ఆఫీస్‌ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం తొలి బ్యాచ్‌ ముగింపు కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న సిబ్బందికి ఆయన పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధించడం అత్యంత అవసరమని తెలిపారు.

ఎంఎస్‌ ఆఫీస్‌, ముఖ్యంగా వర్డ్‌, ఎక్సెల్‌ వంటి సాఫ్ట్వేర్లలో ప్రావీణ్యం పెరగడం ద్వారా కార్యాలయ పనితీరులో వేగం, ఖచ్చితత్వం, సమర్థత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, స్టేషన్‌ రైటర్లు, సైబర్‌ వారియర్స్‌, టెక్‌ టీమ్‌ సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు మొత్తం 180 మంది సిబ్బందిని మూడు బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు మూడు రోజుల చొప్పున శిక్షణ అందిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ పనితీరును మెరుగుపరచుకునే సాధనంగా మలుచుకోవాలని సిబ్బందికి సూచించారు.

పోలీసు శాఖలో సేవల నాణ్యతను పెంచడంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తొలి బ్యాచ్‌ సిబ్బందికి ఎస్పీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వోక్సెన్‌ యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లకు పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వోక్సెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, జిల్లా పోలీసు అధికారులు, శిక్షణ పొందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.