లింక్ కెనాల్ ను సందర్శించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నుంచి ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు తరలిస్తున్న గోదావరి జలాలను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుక్రవారం పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలోని సీతారామ–ఏన్కూరు లింక్ కెనాల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే, కెనాల్ గేట్ల ద్వారా వైరా రిజర్వాయర్‌కు ప్రవహిస్తున్న గోదావరి నీటిని తిలకించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు స్వాగతం పలికి నమస్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, వైరా నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలు అందడం ద్వారా ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేశామని, వ్యవసాయ పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం, అభివృద్ధినే ధ్యేయంగా పాలన సాగిస్తోందని అన్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు రైతులు లక్షలాదిగా తరలివస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, చౌడం నరసింహారావు, వినోభానగర్ సర్పంచ్ గంగావత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
