గంజాయి గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్‌

ఖమ్మం, ఆంధ్రప్రభ: నగరంలోని ప్రకాశ్‌నగర్ పుచ్చకాయల కృష్ణయ్య వెంచర్ ప్రాంతంలో అక్రమంగా గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల ఎండు గంజాయి, రెండు ప్లాస్టిక్ బాంగ్ బాటిళ్లు, ఒక అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్లు త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌బాబు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం నిర్వహించిన పెట్రోలింగ్ సందర్భంగా నిందితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని సనతల ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి సుమారు 500 గ్రాముల గంజాయిని రూ.5 వేలకుప కొనుగోలు చేసి ఖమ్మంకు తీసుకొచ్చినట్లు తేలింది. అందులో కొంత భాగాన్ని వినియోగించి, మిగిలిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైంది.

నిందితులు ప్లాస్టిక్ బాంగ్ బాటిళ్లతో గంజాయి సేవించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి సరఫరా చేసిన ఒడిశాకు చెందిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ మోహన్‌బాబు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.