సింగరేణిని కాపాడడమే కేంద్రం లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: సింగరేణి సంస్థను కాపాడుకోవడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాడిచెర్ల బొగ్గు గనుల కేటాయింపు నిర్ణయం తీసుకున్నామని, దీనిపై తనను విమర్శించడం సరికాదని అన్నారు.తాడిచెర్ల గనుల కేటాయింపు పూర్తిగా న్యాయ నిపుణుల అభిప్రాయాల ఆధారంగానే జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థ మనుగడ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండు ప్రభుత్వాల పాలనలో కలిపి రెండున్నరేళ్లలో రూ.24 వేల కోట్ల బకాయిలు పెరిగాయని, దీంతో సింగరేణి ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆరోపించారు. సింగరేణిని బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, సంస్థ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
