పేదల ఇంటి కలకు చేయూత ఇవ్వండి.. పరిశ్రమలకు ప్రభుత్వ విజ్ఞప్తి
హైదరాబాద్, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతానికి స్టీల్, సిమెంట్ పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. పేదల సొంతింటి కలను సాకారం చేసే ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములై రాయితీ ధరలకు నాణ్యమైన నిర్మాణ సామగ్రిని అందించాలని పరిశ్రమల యాజమాన్యాలను కోరింది.
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పీ. గౌతమ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, టీజీఐఐసీ ఎండీ శశాంకతో కలిసి స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారంపై ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని పేర్కొన్నారు. అందుకే పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా రాయితీ ధరలకు నాణ్యమైన స్టీల్, సిమెంట్‌ను అందించి ప్రభుత్వానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టలేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సమావేశంలో వెల్లడించారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని త్వరగా సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి వర్గం సహకారం అవసరమని చెప్పారు.
లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి సకాలంలో చేరేలా హౌసింగ్ అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగస్వామ్యం కావడానికి స్టీల్, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

