స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులపై గవర్నర్ ప్రశంసలు
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి ఉత్పత్తుల కొనుగోలు
హనుమకొండ (ఆంధ్రప్రభ): హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎస్‌ఈఆర్‌పీ), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వివిధ ఉత్పత్తులను పరిశీలించి, మహిళలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, చేతితో నేసిన వస్త్రాలు, స్వచ్ఛమైన నెయ్యి, వంట నూనెలు, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల శ్రమకు ప్రోత్సాహంగా పలు ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. అలాగే ప్రసిద్ధ వరంగల్ దరీ స్టాల్‌ను సందర్శించి దరీల ప్రత్యేకత, తయారీ ప్రక్రియ, మార్కెట్ అవకాశాలపై ఆరా తీసి వాటి నాణ్యతను ప్రశంసించారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రోత్సాహం అవసరం
స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న నాణ్యమైన ఉత్పత్తులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ఇలాంటి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, గవర్నర్ కార్యదర్శి దాన కిషోర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
