ఐదుగురు నాన్-ఎస్‌సీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
2024 ఎంపిక జాబితా ఆధారంగా రాష్ట్రపతి నియామకాలకు ఆమోదం
ప్రొబేషన్‌పై నియామకం.. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయింపు
జూలై 8న ఉత్తర్వులు జారీ చేసిన సిబ్బంది, శిక్షణ విభాగం…

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ (నాన్-ఎస్‌సీఎస్)కు చెందిన ఐదుగురు అధికారులను భారత పరిపాలనా సేవ (ఐఏఎస్)లో నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) జూలై 8న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించి ఏర్పడిన ఖాళీల భర్తీ కోసం రూపొందించిన సెలెక్ట్ లిస్ట్–2024 ఆధారంగా ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.భారత పరిపాలనా సేవ (రిక్రూట్‌మెంట్) నిబంధనలు–1954, భారత పరిపాలనా సేవ (ఎంపిక ద్వారా నియామకం) నిబంధనలు–1997 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి ఈ నియామకాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. నియమితులైన అధికారులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రొబేషన్‌పై ఉంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించినట్లు స్పష్టం చేసింది.

ఐఏఎస్‌గా నియమితులైన అధికారులు:…

ఐఏఎస్ గా పదోన్నతి పొందిన వారిలో ప్రభల గోపీనాథ్,గుడిస బాలకృష్ణ,ఎం. జయకృష్ణ,ఎ.ఎ.ఎల్. పద్మావతి,డా. మామిళ్లపల్లి వరప్రసాద్ ఉన్నారు. 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఏర్పడిన ఖాళీలకు ఈ ఎంపికలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ కవితా చౌహాన్ అధికారికంగా విడుదల చేశారు.