కొడాలి నానీ.. రాజకీయానికి కౌంట్‌డౌన్ మొదలైంది..

ప్రజలు తిరస్కరించినా మారని అహంకారం..
మళ్లీ మొదలుపెట్టిన విష ప్రచారం..
చంద్రబాబు–పవన్ బంధాన్ని ఎవరూ దెబ్బతీయలేరు
చట్టాలను అవమానించినందుకు చర్యలు తప్పవు..
బహిరంగ చర్చకు సిద్ధం.. రండి చర్చించుకుందాం..
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న..

విజయవాడ, ఆంధ్రప్రభ : కొడాలి నాని కి రాజకీయ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన నాయకులు మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కొడాలి నాని రాజకీయాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించిన ఆయన, దమ్ముంటే వ్యక్తిగత విమర్శలు మాని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న, చంద్రబాబు నాయుడు రాజకీయ అవకాశం కల్పించడంతోనే కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎదిగారని, అదే నాయకత్వంపై ఇప్పుడు విషం చిమ్మడం రాజకీయ కృతఘ్నతకు నిదర్శనమని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ గతంలో చేసిన సవాళ్లు, వ్యాఖ్యలను ప్రజలు తిరస్కరించారని, ఎన్నికల్లో వచ్చిన తీర్పే వారికి గట్టి సమాధానమని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు దూరమవడం వైఎస్సార్సీపీ నాయకుల నైజమని ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారని ఆరోపించిన బుద్దా వెంకన్న, హిందూ దేవుళ్లను అవమానించే వ్యాఖ్యలు చేయడం, చట్టాలను ఎగతాళి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. యూపీఏ చట్టాన్ని కూడా అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, అలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తమ పార్టీ నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ ఇలాంటి నాయకులను ప్రోత్సహించడం వల్లే వైఎస్సార్సీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిందని బుద్దా వెంకన్న అన్నారు. బూతులు తిట్టే వారిని ప్రోత్సహించడం వల్లే ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని వ్యాఖ్యానించారు. నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులకు, హింసాత్మక ధోరణి కలిగిన వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరఫున పోరాడుతుందని, తప్పులను ధైర్యంగా ప్రశ్నించే సంస్కృతి తమదేనని చెప్పారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎలాంటి కుట్రలు, రాజకీయ వ్యాఖ్యలు దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని అన్నారు. చివరిగా కొడాలి నానిని ఉద్దేశించి, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. “ఇది చివరి హెచ్చరిక. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించండి. లేకపోతే రాజకీయంగానూ, చట్టపరంగానూ తగిన సమాధానం ఇస్తాం. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి” అని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.