పెద్దవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి..
దమ్మపేట (ఆంధ్రప్రభ): పెద్దవాగు ప్రాజెక్ట్ గండిపడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయకట్టు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని మంత్రి తుమ్మల నివాసంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెద్దవాగు ప్రాజెక్ట్ దెబ్బతినడంతో ఆయకట్టు రైతులు వరుసగా మూడు పంట సీజన్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించి, ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను అత్యవసరంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పెద్దవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులతో కలిసి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను, ప్రాజెక్ట్ మరమ్మత్తుల అవసరాన్ని వివరించనున్నట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు.
