AQI | మెట్రో నగరాల్లో ‘స్వచ్ఛమైన గాలి’..

  • దేశంలో మారిన వాతావరణం..
  • హైదరాబాద్‌కు ‘గుడ్’ రేటింగ్…
  • ఢిల్లీలోనూ స్వచ్ఛమైన గాలి..
  • కొన్ని ప్రాంతాల్లో మాత్రం ‘పూర్’

ఆంధ్ర‌ప్ర‌భ‌, హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ప‌లు చోట్ల కురుస్తున్న వర్షాల ప్రభావంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. అటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇటు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) గణనీయంగా మెరుగుపడి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మెట్రో నగరాలతో పాటు కొన్ని ఇతర పట్టణాల్లో గాలి నాణ్యత మెరుగుపడిన‌ట్టు తెలుస్తోంది.

మెట్రో నగరాల్లో మెరుగైన గాలి నాణ్యత..

వర్షాల ప్రభావంతో ప్రధాన మెట్రో నగరాలన్నీ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నాయి. ఇందులో మన హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో గాలి నాణ్యత అత్యంత అద్భుతంగా నమోదైంది. పీఎం 10 రేణువుల తీవ్రత తగ్గడంతో 45 పాయింట్లతో నగర వాతావరణం ‘గుడ్’ (Good) కేటగిరీలో నిలిచింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కాలుష్య స్థాయిలు తగ్గి 55 పాయింట్లతో ‘సాటిస్ఫాక్టరీ’ (సంతృప్తికరం) విభాగంలో ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 73 పాయింట్ల ఇండెక్స్ వ్యాల్యూతో వాతావరణం సంతృప్తికరంగా ఉంది. ముంబై మహానగరం 57 పాయింట్లతో, అలాగే ముంబై పరిధిలోని ఇండోర్ ప్రాంతం 63 పాయింట్లతో ‘సాటిస్ఫాక్టరీ’ కేటగిరీలోనే కొనసాగుతున్నాయి. ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 59 గా నమోదైంది. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత తక్కువ కావ‌డం విశేషం.

అక్కడ మాత్రం ఇంకా ‘పూర్’ (Poor) కేటగిరీనే..

దక్షిణాది, పశ్చిమ నగరాలు స్వచ్ఛమైన గాలితో మెరిసిపోతుంటే, ఉత్తరాదిలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. బీహార్ లోని సహర్సా లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత ఆందోళనకరంగా 243 పాయింట్లకు చేరుకుని ‘పూర్’ (Poor) కేటగిరీలో నమోదైంది. అలాగే, బీహార్‌లోని మరో ప్రాంతమైన అర్రాలో సైతం పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక్కడ AQI విలువ 253గా నమోదై ‘పూర్’ కేటగిరీలోనే కొనసాగుతోంది. హర్యానా సరిహద్దు పారిశ్రామిక ప్రాంతమైన బద్దిలో వాయు కాలుష్యం కారణంగా ఇండెక్స్ వాల్యూ 204 పాయింట్లు దాటి ‘పూర్’ కేటగిరీగా నమోదైంది.