మంచిర్యాలలో కలుషిత నీటి కలకలం..

నాలుగు రోజులుగా తాగునీటి సరఫరాకు అంతరాయం

మంచిర్యాల, ఆంధ్రప్రభ: మంచిర్యాల నగరంలో తాగునీటి సరఫరాపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా మున్సిపల్ కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోగా, బుధవారం సరఫరా చేసిన నీటిలో మురుగు నీరు కలిసినట్లు ఆరోపణలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న గోదావరి శుద్ధ జలాల్లో మురుగు నీరు కలవడంతో కలుషిత నీరు సరఫరా అయినట్లు స్థానికులు తెలిపారు. కుళాయిల వద్దకు తాగునీటి కోసం వెళ్లిన ప్రజలకు మురికి నీరు రావడంతో ఆందోళన చెందారు.

కలుషిత నీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విస్మరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.

మున్సిపల్ కుళాయిల ద్వారా వచ్చే నీటిని తాగేందుకు, ఇతర అవసరాలకు కూడా వినియోగించవద్దని స్థానిక నాయకులు సూచిస్తున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.