ఏపీఎయిమ్స్‌తో బహుళ ప్రయోజనాలు
ప్రత్యేక యాప్ సేవలను సద్వినియోగం చేసుకోండి
ఎరువుల సరఫరాలో పారదర్శకతకు పెద్దపీట
ఉద్యాన, స్వల్పకాలిక వరి రకాలు, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వండి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్) యాప్‌తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని.. సమగ్ర వ్యవసాయ సాంకేతికత విధానాలతో అన్నదాతలు మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పెనుగంచిప్రోలులో పీఏసీఎస్, ప్రైవేటు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ప్రస్తుత ఎరువుల సరఫరా వ్యవస్థపై అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆన్లైన్ ఎరువుల సరఫరా సేవల వల్ల ఎరువులు పక్కదారి పట్టకుండా, సరైన సమయానికి సరైన మోతాదులో ఎరువులు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తమకు హక్కుగా ఎంత యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు వస్తాయో తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు పక్కదారి అనే మాట లేకుండా అత్యంత పారదర్శక విధానాన్ని అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా సమగ్ర వ్యవసాయ సాంకేతిక సమాచారం వారి మొబైల్ ఫోన్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ యాప్‌ను ప్రతిఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని.. యాప్ ద్వారా రైతులు వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను సులభంగా తమ మొబైల్ ఫోన్లోనే పొందవచ్చన్నారు. వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటలపై నిపుణుల సలహాలు, వ్యవసాయ శాఖ తాజా సమాచారం కూడా అందుబాటులో ఉంటుందన్నారు. వేసిన పంట ఆధారంగా తగిన పరిమాణంలో ఎరువులు అందజేయడం వల్ల సమగ్ర పంటల యాజమాన్యానికి వీలవుతోందన్నారు. ఎరువుల సరఫరాకు సంబంధించి ప్రతి దుకాణం వద్ద ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. అదేవిధంగా 91549 70454 కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నంబర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు.
స్థానిక వ్యవసాయ, సహకార శాఖ అధికారులను కూడా సంప్రదించవచ్చన్నారు. ఎల్‌నినోతో వాతావరణంలో అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా ఇబ్బందిలేకుండా ఉండేందుకు రైతులు ఉద్యాన పంటలు, స్వల్పకాలిక వరి పంట రకాలు, అంతర పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు పంట నష్టాల ప్రమాదాన్ని తగ్గించి, మెరుగైన దిగుబడి, ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. తనిఖీల్లో కలెక్టర్ వెంట జగ్గయ్యపేట ఏడీఏ సి.భవాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు తదితరులు ఉన్నారు.
