నంద్యాలలో వైఎస్సార్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

భారీ ర్యాలీతో ఘనంగా నిర్వహించిన కార్యక్రమం
మళ్లీ నంద్యాలలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని శిల్పా ధీమా
రానున్నది జగనన్న పాలన.. రాజన్న రాజ్యమని వ్యాఖ్య

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, కల్పలతా రెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నివాసం నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా శ్రీనివాస సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మహానేత విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం వైఎస్సార్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని, అదే బాటలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన సాగించారని పేర్కొన్నారు. నంద్యాలలో భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన శిల్పా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినా, మరింత బలమైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి చూపించామని అన్నారు. విగ్రహాన్ని తొలగించగలిగినా ప్రజల గుండెల్లో ఉన్న రాజన్నను ఎవరూ చెరపలేరని పేర్కొన్నారు. 2009లో మరణించిన నాయకుడికి 2026లో కూడా ప్రజల్లో అదే స్థాయి ఆదరణ ఉండటం ఆయన ప్రజాదరణకు నిదర్శనమన్నారు.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం మాత్రమే ఉందని, ఇప్పటికే సగం కాలం పూర్తై రెండో అర్ధభాగం ప్రారంభమైందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాలలో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని, రానున్నది జగనన్న పాలన, రాజన్న రాజ్యమేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో పి.పి. మధుసూదన్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, శశికళ రెడ్డి, రత్నబాబు చౌదరి, శంకర్ నాయక్, మభూన్నిసా, దాల్మిల్ అమీర్, సోమశేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.