రూ.1.36 కోట్ల విలువైన 679 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత
ఐదో విడత ‘మొబైల్ రికవరీ మేళా’లో పంపిణీ
మొత్తం ఐదు విడతల్లో 3,081 ఫోన్ల రికవరీ
మొబైల్ పోయినా వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచన
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ బృందం రికవరీ చేసిన రూ.1.36 కోట్ల విలువైన 679 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధితులకు బుధవారం అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన ఐదో విడత ‘మొబైల్ రికవరీ మేళా’ కార్యక్రమంలో ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐదో విడతలో రూ.1.36 కోట్ల విలువైన 679 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో మొత్తం 3,081 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.6.20 కోట్లుగా పేర్కొన్నారు.
మొదటి విడతలో 600, రెండో విడతలో 604, మూడో విడతలో 669, నాలుగో విడతలో 529, ఐదో విడతలో 679 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వివరించారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు http://kurnoolpolice.in/mobiletheft ద్వారా లేదా సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి రుసుము లేకుండా పోలీసులు ఉచితంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు.
కేరళ, మహారాష్ట్ర, ముంబై, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిందని, బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారం, వ్యాపార లావాదేవీలు, పాస్‌వర్డ్లు వంటి కీలక వివరాలు అందులో ఉంటాయని గుర్తు చేశారు. మొబైల్ పోగొట్టుకున్నప్పుడు వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని సూచించారు. కొత్త భద్రతా ఫీచర్లను వినియోగదారులు తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలని తెలిపారు.
మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసిన సైబర్ ల్యాబ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రశంసించి అభినందన పత్రాలు అందజేశారు. కేరళ, మహారాష్ట్ర, ముంబై, రాజస్థాన్, కర్ణాటక నుంచి తమ మొబైల్ ఫోన్లు రికవరీ చేసినందుకు పలువురు బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్, సీఐలు మధుసూదన్ రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సాంకేతిక బృందం పోలీసులు పాల్గొన్నారు.
