పేదల గుండె చప్పుడు వైఎస్సార్: గడ్డం త్రిమూర్తి
దండేపల్లి, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేద ప్రజల గుండె చప్పుడు అని జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి అన్నారు. వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా బుధవారం దండేపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. జలయజ్ఞంలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించి సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన పాలనలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయని, నిరుపేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ రాకేష్, కాంగ్రెస్ నాయకులు గుర్రాల రమేష్, ఎల్తపు భాణేష్, 108 సిబ్బంది అరిగేల కిషన్, మామిడి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
